Saturday, January 20, 2007

నీకిదేమన్నా బాగుందా?

పాపం మా స్నేహితుడండీ, ఒక అమ్మయికి ఎంత ప్రఫోజ్ చేసినా తను ఒప్పుకొనేది కాదంట సో, కొంచెం గట్టిగా అడగడానికి నన్ను ఒక కవిత రాసిమ్మంటె ఇది రాసిచ్చానండీ.
అసలు నీకిదేమన్నా బాగుందా??
కారు నలుపుని కూడా కృష్ణవర్ణంలా భావించి
ఆరాదించే వారున్నారే,
మరి నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు?
మౌనమే మన సామ్రాజ్యం అనే మూగస్వాములను కూడా
మురిపంగా చూసుకునే ముద్దుగుమ్మలున్నారే,
మరి నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు?
అసహనమే తమకు అసలు ప్రాణంలా భావించే వారినికూడా
తమ ఆరో ప్రాణంలా భావించే అసమాన సుందరీ మణులున్నారే,
మరి నువ్వు నన్నెందుకు ప్రేమించవు?
(ఇది ఆ అమ్మాయి చదివిన తరువాత ఏమయ్యుంటుందో మీరే ఊహించేసుకోండి)

Friday, January 19, 2007

నాకు నచ్చిన కొన్ని యండమూరి మాటలు.

నాకు నచ్చిన రచయితలలో శ్రీ యండమూరి ఒకరు.వారి రచనలలో నాకు నచ్చిన వాక్యాలు నేను నోట్ చేసుకునేవాడిని. వాటిని ఇక్కడ బ్లాగస్థం చేస్తున్నాను.

ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
*********************
విశ్వమంత చోటేల? నీ పక్క ఇరుకుస్థలముండగా.

*********************
ప్రేమంటే హౄదయాన్ని పారేసుకోవడం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వునీ, నువ్వున్నప్పుడు కాలాన్ని పారేసుకోవడం.
*********************
పండగల్ని కోల్పోయిన మనం బాంధవ్యాల్ని కోల్పోతున్నాం. ఆటల్ని మర్చిపోయిన మనం స్నేహాల్ని కోల్పోతున్నాం.జీవితాల్ని యాంత్రికం చేసుకున్న మనం - 'ప్రే...మ 'ని కోల్పోతున్నాం.
*********************
ఇతరులు మీతో రోజుకి గంటో రెండుగంటలో గడపొచ్చు. కానీ మీరు మీతో 24 గంటలు గడపాలి. కాబట్టి మీ కంపెనీ మీకు ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి.
*********************
కోపం, బాధ, ఉక్రోషం, దిగులు వీటన్నిటికన్నా మనిషికి పెద్ద నరకం- తప్పుచేసానన్న ఫీలింగ్. *********************
నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను. నువ్వు తప్ప!
**************************
ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు. తనక్కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తనగురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ.
**************************
ఎన్నో సాదిస్తున్న మనిషి సాటి మనిషి దగ్గరకొచ్చేసరికి సంకుచితమైపోతున్నాడు. **************************
పది రూపాయల టానిక్ వ్రాస్తేనే రోగి సంతృప్తి పడతాడు. దాని బదులు ప్రశస్తమైన గంజి త్రాగు అంటే వేరే డాక్టర్ని వెదుక్కుంటాడు.
**************************
గ్రామపు పొలిమేరల్లో, గుడిసె ముంగిట్లో, రాట్నం ముందు కూర్చుని ఈలోకపు బాధలతోనూ, వ్యధలతోనూ నిమిత్తం లేకుండా నూలు వడికే వృద్ధురాలి మొహంలో కనిపించే ఆనందాన్ని ఏ రచయిత వర్ణించగలడు. శబరి వణికే చేతులు, జటాయువు విరిగిన రెక్కలు సేవలో ఉండే ఆనందాన్ని తెలుపుతాయి.
****************************
కళ్ళకింద నల్లగీతలు, నుదుటి మీద ముడుతలతో పాటు అర్ధ శతాబ్దపు జీవితం మనిషికి మొహంలో వర్చస్సుని కూడా తీసుకురావాలి. అలాంటి వర్చస్సు లేని మనిషి జీవితం ఒంటరితనం అనే ఊబిలో కూరుకుపోతుంది.
****************************
వయస్సులో వృద్ధ శవాన్ని, జ్ఞానంలో శైశవాన్ని.
****************************
చెట్టునీ, పుట్టనీ ప్రేమించలగాలి. వర్షాన్ని, మంచునీ ప్రేమించగలగాలి. మేఘమొస్తుంటే సంతోషించాలి. పువ్వు పూస్తుంటే మైమరచిపోవాలి అదీ ప్రేమంటే. విశ్వాన్ని, ప్రకృతిని, సాటి మనిషినీ ప్రేమించేవాడి మనసు నుంచి ఆనందాన్నీ, పెదవి మీద నుంచి చిరునవ్వుని బ్రహ్మకూడా చెరపలేడు.
*****************************
ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
*****************************
నేను ఫోన్ చేసినప్పుడు అతడు 'హల్లో' అని సంతోషంగా అన్నడనుకో ...చూసావా! నేను దగ్గరలేకపోయినా అతడు సంతోషంగా ఉన్నాడనే ఉక్రోషం! మామూలుగా 'హల్లో' అన్నాడనుకో, నా స్వరం విన్నాక కూడా అతడిలో సంతోషంలేదని బాధ! పోనీ అతడు బాధగా 'హల్లో' అన్నాడనుకో, ఇక ఇటునుంచి నేను ఏడ్చేస్తాను. అది పబ్లిక్ టెలిఫోన్ అయినా సరే..
*****************************
ఏ రోజైనా, ఏ మాసమైనా అతడు వెళ్ళినతరువాతే తాను వస్తుందని తెలియని సంధ్య, సూర్యుడికి ప్రేమలేఖలు వ్రాసి, వ్రాసి ఎదురుచూసి, చూసి గడ్డిపరకల మీద కన్నీటి బొట్టువదిలి వెళ్ళిపోతుందట.
*****************************
నా ప్రేమ స్వచ్చమైనదైతే నీవెందుకు నాకు!నీ జ్ఞాపకం చాలు! నాతో ఉండాలనుకోవటం స్వార్థం. నాప్రేమ ఎప్పుడైతే ఈ స్వార్ధాన్ని అధిగమించిందో, అది నిన్ను దాటి జాతిని, కులాన్ని రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని దాటి విశ్వవ్యాప్తమవుతుంది. అదే విశ్వజనీనమైన ప్రేమ.
****************************
ప్రతి మొగవాడూ స్త్రీ దగ్గర ఏ వయసులోనైనా చిన్నవాడే. చిన్నపిల్లవాడు తరచూ అద్దంలో తన మొహాన్ని చూసుకోవాలని అనుకున్నట్టు, ప్రతీ పురుషుడూ తనకు స్పూర్తినిచ్చిన స్త్రీ అభినందనపూర్వకమైన చిరునవ్వులో తన విజయాన్ని చూసుకోవాలనుకుంటాడు.
****************************
ఈ ప్రపంచంలో పదిరైళ్ళు ఒకేసారి పరుగెత్తే బ్రిడ్జినైనా వెల్డింగ్ చేసే పరికరం ఉందేమోగాని విరిగిన రెండు మనసుల్ని అతికే ఆయుధం లేదు.
***************************
ఒక మనిషి మరోమనిషిని చంపడానికి కారణం దారుణమైన కక్ష కానక్కరలేదు. అంతకన్నా భయంకరమైన కాంక్ష చాలు.
**************************
మనిషి స్వరూపం కష్టాల్లో ఉన్నప్పుడే బయటపడుతుంది.
**************************
వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. *************************
కాలం గడిచే కొద్దీ మనిషి తన నాగరికతలో ఉన్న లొసుగులని తొలిగించుకున్నాడు బహుభార్యత్వం, బాల్య వివాహం, నరబలి, సతీసహగమనము అలా తొలగిపోయినవే. అయితే తమకి అవసరం లేకపోయినా స్వార్ధం కోసం కొన్నిటిని ఉంచుకున్నాడు. "కులం" అలాంటిదే!
*************************
సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకి బాధపడటం కాదు, చిన్న చిన్న విషయాలకి ఆనందపడటం.
*************************
ఒక ఇంటిగూటిలో-నువ్వెవరితో కలిసి ఉంటున్నావన్నది నీకెప్పుడూ సంతృప్తినివ్వదు. ఎవరితో కలిసి ఉన్నప్పుడు నీ మనసే ఒక ఇల్లవుతుందో అది సంతృప్తినిస్తుంది.
*************************
నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం,అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
************************
వేసే ప్రతి అడుగుకీ అంగుళం దూరంలో ధ్యేయాన్ని పెడతాడు దేవుడు. అందుకే స్వర్గాన్ని అంత ఎత్తులో కట్టాడు. కొందరే అక్కడికి చేరుకోగలరు. అంగలేసి అలసిపోనివాళ్ళు.
************************
మీ బాధల్ని చూసి మీరు బాధపడకండి. పడ్డా మీ మీద మీరు జాలిపడకండి. పడ్డా అది మీ మొహంలో చూపించకండి.
************************
మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
************************
వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది? ************************
దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీఅంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు. *************************
దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒకగీతకి కేవలం అటూ ఇటూ ఉండటాంవల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
*************************
కన్నీరా! క్రందకి జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
*************************
నా దుఃఖాశ్రువులు సముద్రం మీద వర్షంలా కురుస్తాయి. ఒక్కటైనా స్వాతిముత్యమవుతుందేమోనని జీవితకాలం ఎదురుచూస్తూ ఉండగా, ఇంటి ప్రాంగణంలో వృద్ద్యాప్యం నిలబడి పరిహసించిది.
************************
ఊపిరిలోనికి వస్తున్నప్పుడు నువ్వు నాలోకి ప్రవేశిస్తున్న అనుభవమై హృదయం పొంగుతుంది. శ్వాస బయటికొస్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావన్న బాధతో కడుపుతరుక్కుపోతుంది. ఈ ఉచ్చ్వాస నిశ్వాసల్లో కూడా నీవే నిండి ఉన్నావన్న ఆనందంతో గుండె నిండుతోంది.
*************************
నా కలలకి కథావస్తువా! నీకెలా చెప్పను? నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని, నీ కనురెప్పల చప్పుళ్ళలో నాకు వేదం వినబడుతుందని.
*************************
నడుస్తుంటే దూరంగా మసక మసక వెన్నెల్లో కుప్పలా శివాలయం. ఏటి ఒడ్డున నీటీ పువ్వులాంటి జీవితాన్ని స్వప్నం నుంచి వేరు చెస్తున్నట్టూ క్షితిజరేఖ. వెలుగురేఖల్ని వెదజల్లుతూ తూర్పు ముఖాన్ని ఎరుపుచేస్తున్న ఆకాశం. ఆ నీరవంలో జంటగా పాట పాడే భరద్వాజ పక్షులు మాష్టారూ! జీవితానికెంత అందమైన విలువుందో కదూ? ఒంటరి నక్షత్రాన్ని తోడూ తేసుకుని గుడికివెళ్తూంటే గుండెల్నిండా ఓంకారమే.
*************************
జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
*************************
ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తిశిఖరాలని ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతోసహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
*************************
విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
**************************
అన్ని విజయాల్లోకి గొప్పవిజయం దాన్ని ఎక్కువమంది గుర్తించడం.
**************************
ఓటముల్ని లెక్కపెట్టు. గెలుస్తావు.
**************************
సమస్య వేగంగానూ, బలంగానూ పెరిగి బాధపెట్టేది మనసులోనే... బయటికి వస్తే అది బలహీనమవుతుంది.
***************************
దేన్నయినా దాచుకోవడానికి ఏ ప్రపంచంలో అన్నిటికన్నా విశాలమైనదీ భద్రమైనదీ హృదయం.
***************************
దెయ్యాలు శ్మశానంలో ఉండవు. మనిషి మనసులోనే ఉంటాయి. భయం అన్న పేరుతో. ***************************
అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్న ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది. ****************************
ఎక్కువ వ్రాయటానికి చేయితిరగక్కరలేదు. క్లుప్తంగా ముగించడానికే కావాలి.
*****************************
కాసింత చిరునవ్వు, కాసిని కన్నీళ్ళు ..ఇదేనా వీడ్కోలు అంటే?

Thursday, January 18, 2007

కార్తీక దీపం

తోడు కోసం తపించే ఒంటరి దివ్వెని
వెలుగు పంచలేని ఏకాకి చివ్వెని
నేను
కార్తీక మాసంలోని ఆకాశ దీపాన్ని.

పరాయి దేశం.

అనుబందాల అగడ్తలను
మమకారాల మందిరాలను
వదిలి వచ్చేసి ఇప్పుడేడిస్తే
ఏమి లాభం!
ఎవరూ లేక విలపించేవారికన్నా
అందర్నీ వదిలి వచ్చిన
మన జీవితాలు చాలా దారుణం.

Wednesday, January 17, 2007

శై'శవం'

శైశవం శిధిలమైపోతుంది
ఆర్భాటంగా జరగాల్సిన అన్నప్రాసన
విసిరిన విస్తర్లలో కుక్కలతో కలిసి జరుగుతుంది
అద్భుతంగా మొదలవాల్సిన అక్షరాభ్యాసం
అతని అవసరం నాకు లేదంటూ వెనుకడుగు వేస్తుంది
విలాసాల విశ్వరూపం మాట ఎటున్నా
అసలు
అవసరాల అసలు రూపమే ఆనకుండా పోతుంది
పగలంతా సూర్యునితో పాటు తిరుగుతూ
సాయంత్రానికి అలసి ఆకలితో కలిసి
ఏదో పార్కులో లేదా ప్లాట్ ఫారంపై
ఎక్కడో అక్కడ పవళింపు
ప్రేమ అనేది వారిని కనీసం
పలకరించను కూడా పలకరించదు
అనుభూతుల ఆనవాళ్ళే ఉండవు
మనస్సు నిండా మేదస్సు నిండా
నైరాశ్యమే నిండుకుని ఉంటుంది
కాలంపై కసిని ప్రపంచంపై పగని
వాళ్ళకి పెంచుతుంది
శైశవం శిదిలమైపోతుంది

అవశేషం

నీ ప్రేమకు నేను అవశేషం
ఆకాశవనంలో నువ్వు విహరిస్తూ
నక్షత్ర క్షేత్రంలో ఒక దృవతారలా నిలుచున్నా
నిన్ను అందుకోలేక, నిజం జీర్ణించుకోలేక
నీ అనురాగార్థుడుగా ఈ శాంతివనంలో మిగిలిన
నేను నీ ప్రేమకు అవశేషం.

మృత్యుంజయ మంత్రం

మరణం, నా ముంగిట రంగవల్లులద్ది ఎదురుచూస్తుంది
ఎప్పుడు బయటకు వస్తానా అని
దానికీ తెలుసు నీ జ్ఞాపకాలే నాకు లక్ష్మణ రేఖ అని
అవి నాతో ఉన్నంతకాలంఆత్మ పరమాత్మలో కలవదని,
నీ జ్ఞాపకాలే నాకు సంజేవినని
వాటినుండి నన్ను విడదీయడం కష్టమని.
అవును
నిజంగానే నీ జ్ఞాపకాలు నాకు మృతుంజయ మంత్రాలు.

మనసుతో..

అరెసె, పూత రేకుల తియ్యదనాలు
కోలాటాల, గొబ్బెమ్మల పల్లే గుండె చప్పుళ్ళు
ఏవీ ఇక్కడ లేకున్నా
తేనెలూరు నా తెనుగును మాత్రం
గుండెలనిండా నింపుకున్నా.
నాలోని తెలుగు ఎన్నడూ వెలుగు..

ప్రేమకు ప్రేమతత్వానికి ప్రతిరూపం

Posted by Picasa

మిత్రులందరికీ మనసుతో శుభాబినందనలు.

నమస్కారం, నా పేరు తెలుగబ్బాయి, ఇది నా మొదటి ఉత్తరం.