తాతలూ తండ్రులూ అందించిన
ఆస్తులు చక్కగా అనుభవిస్తున్నావు..
అదే తాతలూ తండ్రులు అందించిన
తెలుగును మాత్రం తన్ని తరిమేస్తున్నావు.
శబ్భాష్ రా తెలుగోడా!
గురువు నేర్పిన విద్యతో
కోట్లు గడిస్తున్నావు
అదే గురువు మాట్లాడమనే
తెలుగు మాటను చులకనగా చూస్తున్నావు..
శబ్భాష్ రా తెలుగోడా!
నీ కులం మతం గొప్పదని
మురిసిపోతున్నావు
జాతికి ఆయువుపట్టు అయిన
భాషను మరిచిపోతున్నావు
నువ్వు నిజంగా
శబ్భాష్ రా తెలుగోడా!
పది తరాలకు సరిపడా
సంపదను కూడగడుతున్నావు..
పది కాలాలు ఉండాల్సిన
పది మందికీ పంచాల్సిన
తెలుగును మాత్రం
తుంగలో తొక్కుతున్నావు
నువ్వు నిజంగా
శబ్భాష్ రా తెలుగోడా!