Wednesday, April 20, 2022

తెలుగు

 నా తెలుగు అక్షరం ఆనందతాండవం చెయ్యాలి

తెలుగు శబ్దం శివతాండవం ఆడాలి..

తెలుగు పదానికి పట్టాభిషేకం జరగాలి.

అమ్మ మనిషిగా మారిపోతే!

 అవును.. 

అమ్మ మనిషిగా మారిపోతే!

అదేంటి! అమ్మ మనిషేగా


కాదు కాదు అమ్మ ఎప్పటికీ 

మనిషి కాదు..


అమ్మ మనిషైతే మరి నేను అమ్మలా 

ఎందుకు ఉండలేకపోతున్నాను..


వండి పెట్టడం అమ్మ 

అనుసరించాలిస్న ధర్మమైతే

అన్నంతో పాటు ప్రేమను కూడా 

ఎందుకు తినిపిస్తుంది.


అమ్మ అంత కష్టపడి వండిన వంటైన

ఏదో వంకపెట్టి మనం 

ఏదో ఒకటి అంటూ చిన్నబుచ్చుతుంటే

నవ్వుతూ ఎందుకు భరిస్తుంది.

అది మనసులోకి చొరపడనీయకుండా

ఎందుకు వదిలేస్తుంది. 


గోరుముద్దలతో మనకు కడుపారా తినిపించిన

అమ్మను.. కనీసం 

నువ్వు తిన్నవా అమ్మా 

అని అడగకపోయినా ఎందుకు 

భాదపడకుండా ఉంటుంది?  

 

నన్ను బడికి తయారు చెయ్యడం మాత్రమే

అమ్మ చెయ్యాల్సిన పని ఐతే

నా పాపిడి తీస్తూ  కూడా నీతిని 

ఎందుకు భోదిస్తుంది.


నా బడిగంట వినపడకముందే

నన్ను బడి దగ్గర దింపాలని 

గడియారం కన్నా ముందుగా

ఎందుకు  పరుగెడుతుంది? 


నాకు నిద్ర పట్టకపోతే

అమ్మ తన నిద్ర ఆపుకుని మరీ 

కథలు ఎందుకు చెపుతుంది

ప్రొద్దున్నే నాకన్నా ముందే 

ఎందుకు నిద్రలేచి నన్ను లేపుతుంది.


రాక రాక ఇంటికి వచ్చిన చుట్టాలతో

ఇంట్లోని అందరం కబుర్లు చెప్పుకుంటూ

ఆనందాలతో కేరింతలు కొడుతుంటే

అందరికీ అన్నీ తయారు చేస్తూ

వంటగదిలోంచి అడుగుబయటకు పెట్టే

అవకాశం లేకపోయినా అక్కడినుండే

అన్నీ వింటూ ఎందుకు చిరునవ్వులు చిందిస్తుంది?


నాకు పరిక్షలంటే అమ్మ ఎందుకు 

దేవుళ్ళకు మొక్కుతుంది.

నాకు కొంచెం జ్వరం వస్తే అమ్మ

ఎందుకు తను అన్నం కూడా తినడం మానేసి

నా కోసం విలవిలలాడిపోతుంది. 


అమ్మ మనిషిగా మారిపోతే 

అన్నం ఉంటుంది.. ఆప్యాయత ఉండదు 

 

అమ్మ మనిషిగా మారిపోతే

నా చదువు ఉంటుంది.. సంస్కారం ఉండదు


అమ్మ మనిషిగా మారిపోతే

ఒంటికి ఇస్త్రీ బట్టలు ఉంటాయి

ఆ ఇస్తీ మడతల కింద అంత 

శుద్దమైన మనసు ఉండదు


అంతెందుకు 

అమ్మ మనిషిగా మారిపోతే

ఇల్లు ఉంటుంది.. ఇంట్లో

స్వర్గం ఉండదు

మనుష్యులు ఉంటారు కానీ

మమతలు ఉండవు.


దయచేసి మిత్రులారా..

అమ్మకు సెలవక్కరలేదు

మనం సాయం చేస్తే చాలు..

అమ్మకు పూజలు అక్కరలేదు

Tuesday, April 19, 2022

అమ్మ

 గ్రామపు పొలిమేరల్లో..  పూరి గుడిసె ముంగిట్లో

ఈ ప్రపంచం వదిలేసిన..

సంతోషం తరిమేసిన

ఈ అమ్మ .. రెక్కలు తెగిన గువ్వలా

గుమ్మం ముందు గోడపక్కన  కూలబడి ఉంది.


మనిషిపైన నమ్మకం  పోగొట్టుకుందో..

అనుబందాలను పారబోసుకుందో

అర్ధం కావడం లేదు కానీ

గోళీల్లాంటి ఆ కళ్ళు  

ఆరిపోయిన అగ్ని గోళాల్లా నిస్తేజంగా ఉన్నాయి.

ఆ చెంపల మీద జారిన నీటి జారలను పట్టుకుని

లోపలికి జొరపడి చూస్తే 

మన గుండె ఝల్లుమనే

గతకాలపు గురుతులెన్నో..

అన్నీ తానై పెంచిన  బిడ్డలు

 తనకు అన్నం పెట్టడానికి

వంతులేసుకోవడం చూసి



ఆస్తులన్నీ తీసుకున్న సంతానం

తనకు ఆశ్రయం ఇవ్వడం

గురించి పోట్లాడుకోవడం చూసి

అక్షరాలను కూడగట్టి..  విలువలను మూటకట్టి 

తాను మాటలు నేర్పిన ఆ నోటితో

తననే తూలనాడటం చూసి … 


అమ్మ అంటే అన్నం పెట్టేదే కానీ

కంచం పట్టుకుని చేయి చాచేది కాదు

అని గ్రహించలేని సంతతి దగ్గర   ఉండలేక

తల్లి అంటే ప్రపంచమంతా ఎదురొచ్చినా 

ఎదుర్కునే శక్తిలా బిడ్డలను మార్చేదే తప్ప 

ఎదురుపడితే ముఖం పక్కకు తిప్పుకునే 

పిల్లల పంచనపడి బ్రతకలేక ..

శరీరం సహకరించకున్నా - ఓంట్లో ఓపిక లేకపోయినా

ప్రాణ పధంగా చూసుకున్న ఇంటిని - జ్ఞాపకాలను పోగేసుకున్న తన చోటునీ

వదిలి వనవాసానికి వెళ్ళిన వసుధలా

చీకటి తోడుగా..  చేతికర్ర ఊతగా


తడబడుతున్న ప్రతి అడుగులో

తన  పాత  జ్ఞాపకాలను రాల్చేసుకుంటూ 

దాటుతున్న ప్రతి మలుపులో

మనసును గట్టి చేసుకుంటూ

కన్నీటి మడుగులు తన కాళ్ళను కడుగుతుంటే

అందరితోనూ అన్నపూర్ణ అనిపించుకున్న ఆ అమ్మ

అనాధలా, ఆప్యాయతలు మిగిల్చిన సమిధలా

ఇప్పటికీ తన  బిడ్డల కర్కశత్వాన్ని 

ప్రపంచానికి తెలియనివ్వకూడని,

అమ్మకు అన్నం పెట్టడం లేదు అన్న మాట

బిడ్డలపై పడనివ్వకూడదని

పిచ్చిదైపోయింది అన్న ముద్ర తనపై వేసుకుని

అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు వదిలి పారిపోయింది

అన్న అపవాదు తనతో తీసుకుని..

పాపం, ఆ బిడ్డలు ఎంతో వెతికారు కానీ

ఆచూకీ దొరకలేదు..  అన్న సానుభూతి వారికి మిగిల్చి

తెలిసిన వారికి దూరంగా - అమ్మ అనే మాటకు నిదర్శనంగా

వచ్చి వచ్చి అలసటతో శోష వచ్చి

ఇక్కడ కూలబడి ఉంది.

అమ్మ ఎంతైనా అమ్మేగా …

చేతిలో ఒక బువ్వ ముద్ద-  బిడ్డలు తిన్నారో లేదో 

అన్న  అనుమానంతో తనకు తినడానికి 

మనసు రాక అలాగే  ఆ అమ్మ గుప్పెట సందుల్లో.